Wednesday, 22 August 2012

ఆరాధ్య ముందు 100కోట్లు దిగదుడు పే! 

 బచ్చన్ కుటుంబంలో పుట్టిన 'ఆరాధ్య' ముందు వంద కోట్ల రూపాయలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆరాధ్య పుట్టినప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వదులుకున్న మొత్తమే ఇదంతా. పాప పుట్టాక ఐశ్వర్యరాయ్ లావెక్కటంతో కొన్నాళ్ల వరకు ఆమె వైపు స్పాన్సర్లు, సినిమా నిర్మాతలు పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐశ్వర్యరాయ్ కూడా ఆఫర్ల గురించి పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే ఇటీవల ఆమె కాన్స్‌లో మెరవడం, ఒకటి రెండు సంస్థలతో గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొన్ని ప్రకటనల్లో నటించడంతో మళ్లీ అందరి దృష్టి ఆమెపై పడింది. యాష్ చోప్రా సంస్థ తీయబోతున్న తదుపరి సినిమాలో ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట.

ఆ భారీ బడ్జెట్ సినిమా ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టించేందుకు వారు రెట్టింపు ఆఫర్ చేశారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ఆశ్చర్యకర ఆఫర్ ఐస్‌కు నచ్చినప్పటికీ మరి కొంతకాలం వరకు ఆగాలని ఆమె వారితో చెప్పడం, అయితే ఆ కొంతకాలం ఒక సంవత్సరం కూడా కావొచ్చని ఐస్ అభిప్రాయపడటంతో యాష్ చోప్రా సంస్థ వెనక్కు తగ్గిందట. దాంతోపాటు కొన్ని టెలిఫోన్ సంస్థలు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా ఐశ్వర్యరాయ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ ఆఫర్లు ఇచ్చాయట. వీటన్నిటి మొత్తం దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఆరాధ్యతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్న ఐశ్వర్యరాయ్ యాష్ చోప్రా వర్గాలకు చెప్పిన మాటే వీరికీ చెప్పారట. దాంతో వాళ్లు చేసేది లేక ఊరుకున్నారని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.