త్వరలో ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో సమంత నటించబోతున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్టిట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఒక గ్రేట్ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం తలుపుతట్టింది. పైగా ఆ కథ నాకు విపరీతంగా నచ్చేసింది. అయితే.. ఆ సినిమాకు అధికారికంగా ‘ఓకే’ చెప్పలేదు. అన్నీ కుదిరితే... ఆ సినిమాకు పచ్చజెండా ఊపేస్తాను. ఆ తర్వాత మిగిలిన వివరాలు చెబుతా’’ అని సమంత ట్వీట్ చేశారు. ఇంతకీ సమంతకు అంతగా నచ్చిన ఆ మల్టీస్టారర్... తెలుగు చిత్రమా? లేక తమిళ చిత్రమా అనేది ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో, అటు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా... సమంతకు మల్టీస్టారర్లు మాత్రం బాగా కలిసొచ్చాయి.
తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత కథానాయిక. ఈ మధ్య... విడుదలైన అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’లో కూడా సమంతే కథానాయిక. అంటే త్వరలో ‘ఓకే’ చేయబోయే ఈ సినిమా ముచ్చటగా సమంత నటించబోయే మూడో మల్టీస్టారర్ అన్నమాట. ఇంతకీ ఆ మల్టీస్టారర్ ఏంటి? నాగార్జున, ఎన్టీఆర్‌లతో పైడిపల్లి వంశీ చేయబోయే సినిమానా? లేక... మీడియాలో హల్‌చల్ చేస్తున్న వెంకటేశ్, రవితేజాల సినిమానా? లేక తమిళంలో ఏదైనా సినిమానా? దానికి సమాధానం సమంతే చెప్పాలి.